జనమేజయుడు !
ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.
రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు.
అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశలప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు.
రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.
“పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి” అని అజ్ఞ జారీ చేశాడు.
అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగాడు. సర్పయాగం చెయ్యమని వాళ్ళంతా సలహా యిచ్చారు. క్షణాలమీద యగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
ఉత్తాంక, చండభార్గవ, ఉద్దాలక, ఆత్రేయ, శ్వేతకేతు, నారద, దేవల, దేవశర్మ, మౌద్గల్య మహర్షులు యాగానికి ఆద్వర్యం వహించారు.
సర్పయాగం ప్రారంభమైంది. నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు.
యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి. ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి. అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి అశ్రయించాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు.
ఈ సంగతి ఋత్విక్కులకు తెలీక అసలైన శత్రువు తక్షకుడు చావునుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉధృతం చేశారు. దానితో తక్షకుడికి ఒళ్ళంతా మంటలు లేచాయి. ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు.
తన చెల్లెలు జరత్కారుప్రియను పిలిచి ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు. తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జరత్కారుమహర్షిని పెళ్ళాడినందువల్ల జరత్కారుప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె ఆ భాద్యతను తన కొడుకు ఆస్తీకుడికి అప్పగించింది. అతను యాగం జరిగేచోటికి బయలుదేరాడు. తక్షకుడి జాడ తెలీక ఈలోగా ఉత్తాంకుడు కోపోద్రిక్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు. తక్షకుడు అమరావతీ పట్టణంలో ఇంద్రుడితోపాటు సగం సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు. అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది. ‘ఇంద్రుడు నిన్ను రక్షించేవాడా‘ అనుకుని ఇంద్రుడూ, ఇంద్రసింహాసనమూ, తక్షకుడూ అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేతబట్టుకుని మంత్రాలు పఠించాడు.